|
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ ప్రారంభించి
పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గత శని,
ఆదివారాల్లో (సెప్టెంబరు 20, 21) నిర్వహించిన తెలుగు సాహితీ
సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. నిర్వాహకులు
ఊహించినదానికంటే ఎక్కువగా సాహిత్యాభిమానులు సమావేశాలకు
అమెరికా నలుమూలల్నుండి, కెనడా నుండి, జర్మనీ నుండి,
భారతదేశం నుండి రావడంతో ఎంతో ఉత్సాహవంతమైన వాతావరణం
నెలకొంది. శనివారం సభ ప్రారంభ సమయానికే సుమారు 150 మంది
వరకు సాహిత్యాభిలాషులు సమావేశమయ్యారు. నిష్పాక్షికమైన
సాహిత్య విమర్శకు తెలుగు సాహిత్యంలో ఉన్న స్థానం, దాని
ఆవశ్యకత ప్రధాన వస్తువుగా ఏర్పరచిన ఈ సమావేశాలు,
సభానిర్వాహకులు మద్దిపాటి కృష్ణారావు గారి స్వాగతంతోను,
ఆపైన విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ ఆచార్యులు వెల్చేరు
నారాయణరావు గారి ముఖ్యోపన్యాసంతో శనివారం ఉదయం
ప్రారంభమయ్యాయి. సాహిత్యంపై దృష్టి సారించి, వాదాలకు దూరంగా
విమర్శ ఉండాలని, అప్పుడే తెలుగు సాహిత్యానికి ప్రపంచంలో
గుర్తింపు సాధ్యమని నారాయణరావు గారు వివరించారు. మధ్యాహ్నం
వచన సాహిత్యంపై జరిగిన సమావేశంలో ప్రముఖ నవలా, కథా రచయిత్రి
చంద్రలత ముఖ్య అతిథిగా తెలుగు నవల పూర్వాపరాలను చర్చిస్తూ
ప్రసంగించారు. ఇదే సమావేశంలో కొడవళ్ళ హనుమంతరావు గారు
వడ్డెర చండీదాస్ నవల అనుక్షణికం లో గాయత్రి పాత్రను
విశ్లేషిస్తే, కారుమంచి శ్రియ, ఓల్గా రాసిన రాజకీయ కథల్లోని
స్త్రీవాద భావజాలాన్ని అమెరికాలో పుట్టి పెరిగిన యువతిగా
తన స్వానుభవంతో వివరించారు. ఆరి సీతారామయ్య గారు మంచి కథకు
ఉండవలసిన లక్షణాల్ని, రచయిత తనకథల్లోని లోపాల్ని
సవరించుకోవడానికి చెయ్యవలసిన కృషిని చర్చించారు.రెండవ
సమావేశంలో తెలుగు కవిత్వంపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి
కన్నెగంటి చంద్ర నిర్వాహకులుగా వ్యవహరించగా, వెంకటయోగి
నారాయణస్వామి, విన్నకోట రవిశంకర్, తమ్మినేని యదుకులభూషణ్,
వేలూరి వెంకటేశ్వరరావు గార్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో
తెలుగు కవిత్వంలో ఊహలు, అపోహలు, ప్రేరణ, నాగరికత, పాఠకుల
స్పందనలపై విస్తృతమైన చర్చ జరిగింది.
సాయంత్రం జరిగిన విందు, వినోద కార్యక్రమాల్లో, కొందరు కవులు,
రచయితలు తమ స్వీయ రచనల్ను వినిపించారు. అమెరికాలో పుట్టు,
పెరిగిన చిరంజీవి అల్లూరి స్పందన తన కుటుంబ సభ్యులను
కేంద్రంగా అల్లి చదివిన కవిత అందరినీ ఆకర్షించింది.
డిట్రాయిట్ తెలుగు యువత జానపద నృత్యాలతో
ప్రేక్షకులనలరించారు. వంగూరి ఫౌడేషాన్ ఆఫ్ అమెరికా వారి
ప్రచురణలు అమెరికా తెలుగు కథానిక, అమెరికామెడి నాటికలు
ఆవిష్కరించారు. వాసిరెడ్డి నవీన్ సంపాదకత్వంలో తెలంగాణా
విముక్తి పోరాట కథల సంకలనాన్ని డిట్రాయిట్ తెలుగు లిటరరీ
క్లబ్ ప్రచురించి, ఈ దశవార్షికోత్సవ సమావేశాల సంద్రభంగా
ఆవిష్కరించారు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి తన
అనువాదాల ద్వారా పరిచయంచేస్తున్న వెల్చేరు నారాయణరావు
గారిని, పేరెన్నికగన్న రచనల ద్వారా తెలుగు నవలకు తిరిగి
జీవం పోసిన చంద్రలత గారిని, డిట్రాయిట్ లోను, ఆంధ్రప్రదేశ్
లోను తెలుగు సాహిత్యానికి, ఇతర కళలకు, ఇతోధికం
ప్రోత్సాహాన్నిస్తున్న వడ్లమూడి బాబు రాజేంద్రప్రసాద్
గారిని, కంప్యూటర్లపై తెలుగు వ్రాయడానికి మొదటి సారిగా ఒక
ప్రమాణాన్ని అందించిన కన్నెగంటి రామారావు గారికి,
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ విశిష్ఠ సేవా పురస్కారాలతో
సత్కరించారు.
రెండవరోజు ఉదయం కన్నెగంటి రామారావు నిర్వాహకులుగా తెలుగులో
ప్రచురణలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఎలక్ట్రానిక్
ప్రచురణలపై కొలిచాల సురేశ్, అమెరికాలో పుస్తకాల పంపిణీపై
వంగూరి చిట్టెన్ రాజు, పాత పుస్తకాలను డిజిటైజ్ చెయ్యడంలోని
సమస్యల గురించి పారినంది లక్ష్మీనరసింహం (పాలన),
పుస్తకాన్ని ప్రచురించడానికి, అచ్చువేయడానికి ఉన్న తేడాను
వివరిస్తూ వెల్చేరు నారాయణరావు గార్లు ప్రసంగించారు.
పుస్తక ప్రచురణలో సాంకేతికంగా వస్తున్న మార్పులపైనా,
పంపిణీపైన్, పరిష్కరణ లేమి మొదలైన అంశాలపై విస్తృతమైన చర్చ
జరిగింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన నాల్గవ సమావేశంలో,
ముందుగా ప్రస్తుతం తెలుగు సినిమా చరిత్ర రచనల గురించి
జర్మనీ నుంచి వచ్చిన పరుచూరి శ్రీనివాస్ చర్చించారు.
మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడు పోతున్న తెలుగు సినిమా
చరిత్ర పుస్తకాల్లో పరిశోధనకు శ్రద్ధ చూపకపోవడంపై చాలా
చర్చ జరిగింది. తరువాత తెలుగులో ఈమధ్య విపరీతంగా పెరిగిన
బ్లాగులపై చర్చ జరిగింది. ఈ చర్చకు శంకగిరి నారాయణస్వామి (నాసి)
నిర్వాకులుగా వ్యవహరించారు. బ్లాగుల్లోని తెలుగు సాహిత్యంపై
చర్చ జరగాలన్నది అసలు ఉద్దేశంగా అనిపించినా, చర్చకు బదులు
బ్లాగుల్ని పరిచయం చెయ్యడం, అసలు బ్లాగులు ఎలా చేస్తారో
వివరించడంతో సరిపోయింది. వైజాసత్య రవి తెలుగు వికీపీడియాను
పరిచయం చేస్తే, బసాబత్తిన శ్రీనివాసులు, చీమకుర్తి
భాస్కరరావు, నాగం శరత్ గార్లు బ్లాగుల్ని పరిచయం చేశారు.
ప్రవాసాంధ్రులు ఎలక్ట్రానిక్ మీడియాలోనే తెలుగును ఎక్కువగా
వాడుతుండడంతో ఈ చర్చ ఆసక్తికరంగా జరిగింది. చివరిగా,
విశ్వవిద్యాలయాల్లో తెలుగు బోధన, పరిశోధన పై జరపదల్చుకున్న
చర్చను సమయం లేకపోవడం వల్ల కుదించి, తెలుగును విదేశీ భాషగా
అమెరికాలోని పాఠశాలల్లో ప్రవేశ పెట్టడం గురించి అరుణ పాణిని
గారి ఉపన్యాసంతో సమావేశం ముగిసింది. అమెరికాలో పాఠశల
విద్యార్ధులంతా ఒక విదేశీ భాష నేర్చుకుని తీరాలి. అది
ఏభాషైనా కావచ్చు. అది తెలుగే ఎందుకు కాకూడదన్నది అరుణ గారి
ప్రశ్న. దీనికి ఒక ప్రణాళికను కూడా సూచన ప్రాయంగా అరుణ గారు
ప్రతిపాదించారు. సమావేశ నిర్వాహకులు మద్దిపాటి కృష్ణారావు
గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
కొన్ని సాంకేతిక సమస్యలవల్ల ప్రారంభం 9 నిమిషాలు ఆలస్యం
కావడం సమయాభావానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే లిటరరీ క్లబ్
నిర్వాహకులకు నచ్చినట్లు లేదు. కానీ ఆ తర్వాత ఎంతో
ఉత్సాహంగా సభికులు చర్చల్లో పాల్గొనడంతో రెండవరోజు
మధ్యాహ్నానికి ఈ ఆలస్యం 30 నిమిషాలకు పెరిగింది. ఐనా
సమావేశాలు పూర్తయ్యే వరకూ (ఆమాటకొస్తే పూర్తయ్యాక కూడా!)
ఒక్కరూ కదల్లేదు. మొత్తానికి సమావేశాలు చాలా ఆసక్తికరంగానూ,
క్రమపద్ధతిలోనూ జరిగాయని అందరూ కార్యనిర్వాహకులను
అభినందించారు. ఈ సమావేశాలు చాలా బాగా జరిగాయన్న ఆనందంతో
అన్ని ప్రాంతాల నుండి వచ్చిన తెలుగు సాహిత్యాభిమానులు వచ్చే
సంవత్సరం కొడవటిగంటి కుటుంబరావు, త్రిపురనేని గోపీచంద్,
శ్రీశ్రీ శతజయంతి జరపాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన
సూత్రప్రాయంగా అంగీకరించబడింది.
|